మహాత్మాగాంధీ పోటీ చేసిన నోట్లు పంచాల్సిందే..!!

 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. నాయకుడు అంటే నలుగురిని నడిపించేవాడు కాదు, నలుగురికి నోట్లు పంచేవాడు అనిపిస్తుంది.. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో నాయకులు, మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రచార పత్రాలు పంచేవారు.. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పినా చెప్పకపోయినా.. ఎంతిస్తే ఓటేస్తారని అడిగి మరీ నోట్లు పంచుతున్నారు.. ప్రజలు నోట్లు తీసుకొని ఓట్లేస్తున్నారు.. తరువాత నాయకులు పని చెయ్యట్లేదు, అవినీతి పెరిగిపోయింది అంటూ బాధపడుతున్నారు.. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా నోట్లిచ్చే నాయుడు కాదు మంచి చేసే నాయుడుకి ఓటేద్దాం అనుకుంటారా?.. అబ్బే లేదు.. అదే పాత పాట.. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది?.. నోట్లు పంచే నాయకుడుది కాదు, ఆ నోట్లు తీసుకుని ఓటేసే ప్రజలది.. ప్రజలు నోట్లకి అలవాటు పడిపోయారు కాబట్టే, కొందరు మంచి నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు పంచుతున్నారు, నోట్లు పంచలేని మంచి నాయకులు సాధారణ ఓటర్లులా మిగిలిపోతున్నారు.. ఈ నిజం నాయకులకి కూడా తెల్సు.. కానీ ప్రజలకి చెప్పలేరు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు..  ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయి.. స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని అన్నారు.. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు.. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని, పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు.. ఇది అందరికీ తెల్సిన నిజమే.. కొందరు ఆయనలా బయటపడతారు, మిగతావారు బయటపడరు అంతే తేడా.. దేశం మారాలంటే ముందు ప్రజలు మారాలి.. ప్రజలు మారితే మంచి నాయకులు వస్తారు.. ఆటోమేటిక్ గా దేశం మారుతుంది.