ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి

సీఎం నుండి ఎమ్మెల్యే ల వరకు ప్రజల కోసం ఎంతలా కష్టపడినా కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మూలంగా అనవసరంగా ప్రభుత్వం విమర్శలపాలు కావాల్సి ఉంటుంది.. తాజాగా అలాంటి సంఘటనే ఏపీలో జరిగింది.. సమయానికి ఎమ్మెల్యే చూసి స్పందించడంతో మంచి జరిగింది.

 

 

అసలు మేటర్ ఏంటంటే, బంద గ్రామానికి చెందిన కలుముల దుర్గ అనే మహిళ తన ఇంట్లో బిడ్డకి జన్మనిచ్చింది.. తరువాత వైద్య పరీక్షల కోసం తూర్పు గోదావరి జిల్లా బోదులూరు పీహెచ్‌సీకి వెళ్ళింది.. అనంతరం ఆమెను ‘తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్’లో ఇంటికి చేర్చాల్సిన సిబ్బంది, ఆమె గ్రామానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం వుండగా ఆకుమామిడికోటలో రోజుల పసిబిడ్డతో సహా దింపేసి, అక్కడి నుంచి ఆమె గ్రామానికి నడిచి వెళ్లాలని చెప్పి తమదారిన తాము పోయారు.. పాపం చేసేదేమీ లేక, బిడ్డను ఎత్తుకొని ఆమె రోడ్ పై నడిచి వెళుతుండగా, మారేడుమిల్లి మండలంలో జరిగిన ‘గ్రామదర్శిని - గ్రామవికాసం’ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆమెను చూశారు.. కారు దిగి ఆమెను వివరాలు అడిగి తెలుసుకొని చలించిపోయారు.. వెంటనే తన కారులో తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అంబులెన్సులో గ్రామానికి చేర్చారు.. అయితే ఎమ్మెల్యే రాజేశ్వరి పీహెచ్‌సీ సిబ్బంది తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.. ఎమ్మెల్యే చెప్పింది కూడా నిజమే ప్రభుత్వం ప్రజల కోసం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే అనవసరంగా చెడ్డపేరు మూటకట్టుకోవాల్సి వస్తుంది.