TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్యాంక్‌బండ్‌పై సీతక్క మెరుపు ధర్నా.. పోలీసులకు షాక్‌..

Published on: Wed Jan 12, 2022 2:09PM

మాస్ లీడ‌ర్ సీత‌క్క మెరుపు ధ‌ర్నాకు దిగారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసుల‌కు చుక్క‌లు చూపించారు. 317 జీవోకు వ్య‌తిరేకంగా, ఉపాధ్యాయుల పోరాటానికి మ‌ద్ద‌తుగా.. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే సీతక్క ధర్నా చేప‌ట్టారు. ఈ ఊహించ‌ని ప‌రిణామానికి అవాక్కైన పోలీసులు.. అంతలోనే తేరుకున్నారు. సీత‌క్క‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా త‌ర‌లించారు. 

అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సీత‌క్క మండిప‌డ్డారు. 9 మంది టీచర్లు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిల‌దీశారు. బీజేపీ నేత‌లు డ్రామాలు ఆపి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయించాలని సీతక్క డిమాండ్ చేశారు.

317 జీవో రద్దు చేయాలని.. ఉద్యోగులతో చర్చలు జరపాలని సీతక్క నినదించారు. స్థానికత ఆధారంగా బదిలీలు ఉండాల‌న్నారు. ట్రైబల్ ఉద్యోగులను మైదానాలకు, మైదాన‌ ఉద్యోగులను అటవీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని మండిప‌డ్డారు. 

సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్‌ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు ఉద్య‌మిస్తున్నారు. కేటాయింపుల్లో సీనియారిటీ జాబితాలో జరిగిన తప్పులను సవరించాలని టీచ‌ర్లు కోరుతున్నారు. జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు చేప‌ట్టిన‌ ఆందోళనకు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే సీత‌క్క ఇలా ధ‌ర్నా చేశారు.