మరో పాతికేళ్ళు కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వరు.. ఏం చేసుకుంటారో చేసుకోండి: రోజా

సీఎం జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ వ్యవహారం అంతకంతకు ముదురుతోంది. ఒక పక్క టీడీపీ, బీజేపీ, అలాగే హిందూ సంఘాలు వందల ఏళ్ళ నుండి ఉన్న సంప్రదాయాల ప్రకారం సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలని పట్టు పడుతుండగా మరో పక్క మంత్రి కొడాలి నాని వంటి వారు సీఎం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అటు ప్రతిపక్షాలు ఇటు హిందూ సంఘాల పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

 

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల దుమారం చల్లారాక ముందే తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా అగ్నిలో ఆజ్యం పొసే పని చేస్తున్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఏం చేసుకుంటారో చేసుకోండని తాజాగా రోజా సవాల్ చేశారు. ఆమె అంతటితో ఆగకుండా.. వచ్చేమూడేళ్లు మాత్రమే కాదు.. జగన్ మరో పాతిక, ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారని అన్ని సంవత్సరాలు ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండానే తిరుమల దర్శననానికి వెళ్తారని ప్రకటించి మరో వివాదానికి తేరా తీశారు.

 

ఇప్పటికే ఓ వైపు కొడాలి నాని వ్యాఖ్యలతోనే హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంస్థలు మరింతగా భగ్గమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తిరుమల శ్రీవారిపై నమ్మకంతోనే వెళ్తున్నప్పుడు తమకు విశ్వాసం ఉందని ఓ డిక్లరేషన్ ఇస్తే సమసిపోయే వివాదాన్ని ఇలా ఎందుకు ఉద్దేశపూర్వకంగా వివాదం పెద్దది చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో కాస్త నోరున్న నేతలు ఎవరూ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అసలు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

 

వైసిపి నేతలు కొడాలి నాని, రోజా తీవ్ర వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందని విశ్లేషకులు చెపుతున్నారు. కొద్దీ రోజులుగా ఏపీలో హిందూ ప్రార్థన స్థలాలపై వరుసగా జరుగుతున్న దాడులతో అటు వైసిపి, ఇటు బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తూ ఉండడంతో ఒక వర్గం ప్రజల్లోకి బీజేపీ చొచ్చుకుపోతుందని దీంతో ప్రతిపక్ష టీడీపీని నిర్వీర్యం చేయవచ్చనే ఉద్దేశంతో రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కొందరి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.