అబ్బే మంత్రిగిరి రాలేదని నాకేం బాధలేదు: రోజా

 

వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే రోజా అలకబూనారని, ఆమెని బుజ్జగించేందుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పోస్ట్ ఇవ్వడానికి జగన్ సిద్దమయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజా మాత్రం అలాంటిదేమి లేదని, ఇదంతా మీడియా సృష్టేనని అంటున్నారు. ఈరోజు విజయవాడ చేరుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను విజయవాడ ఎవరూ రమ్మని పిలవలేదన్నారు. బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో.. వాటికి హాజరయ్యేందుకే విజయవాడ వచ్చానన్నారు. తనకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు రోజా. తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదన్నారామె. మంత్రి పదవి రాకపోవడంతో తాను అలిగానని చెప్పడం.. కేవలం మీడియా సృష్టే అని ఆరోపించారు. కులాల సమీకరణల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల లిస్టులో తాను ఫిట్ అవ్వలేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను కులాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె ఎందుకు గైర్హాజరయ్యారన్న విషయాన్ని కూడా వెల్లడించారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రిగా ప్రమాణం చేసే వారుంటే చాలు.. అందుకే ఆ కార్యక్రమానికి తాను వెళ్లలేదన్నారు. అయితే మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్న రోజా.. జగన్ పిలిస్తే తప్పకుండా వెళ్లి కలిసి వస్తానన్నారు. కానీ రోజా పైకి అలా చెబుతున్నా.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.