ఎమ్మెల్యే రోజా గన్ మేన్ కు కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ నియోజకవర్గ ప్రజలు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది వైసిపి ఎమ్మెల్యేలకు కూడా వైరస్ సోకింది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ ఐన రోజా గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది. దీంతో రోజాతో సహా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇపుడు అందరికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా టెస్టులు చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే రోజా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గం అయిన నగరిలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ కార్యక్రమాలలో భాగంగా రోజా కూడా నగరిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలో ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనాతో కొంత మంది మృతి చెందారు.

ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నాయి. ఐతే రోజా తన పర్యటనలలో భౌతిక దూరం పాటించక పోవడమే కాకుండా ఆమె స్వయంగా మాస్క్ కూడా ధరించకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు కూడా అమె కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో తనపై పూల వర్షం కూడా కురిసింది. ఈ విషయంలోనూ ఆమెపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కొద్దీ రోజుల క్రితం ఆమె 108 అంబులెన్స్ కూడా నడిపిన సంగతి తెలిసిందే. ఐతే అమె కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆమే నియమాలు పాటించపోతే ఎలా అని స్థానికులు నిలదీస్తున్నారు.