రోజాకు బంప‌ర్ ఆఫ‌ర్.. ఆ పదవితో బుజ్జగిస్తున్న జగన్..!

 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని భావించిన నాయ‌కుల్లో ప్రధానంగా వినిపించిన పేరు ఆర్కే రోజా. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయం అంటూ వార్త‌లు వ‌చ్చాయి. తీరా మంత్రివ‌ర్గం ఏర్పాట‌య్యే స‌రికి.. రోజాకు చోటు ద‌క్క‌లేదు.

తన‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నందుకు రోజా అలిగార‌ని, అందుకే ఆమె పార్టీ కార్య‌క‌లాపాల‌కు కాస్త దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌ని కూడా వార్తలొస్తున్నాయి. దీనితో ఆమెను బుజ్జగించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా రోజాకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైసీపీలో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌ ది రెండో స్థానం. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌రువాత ఆ స్థాయిలో ప‌లుకుబ‌డి ఉన్న పోస్ట్ అది. ప్ర‌యాణికుల రూపంలో రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు, ఉద్యోగులు, కార్మికుల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధం ఉన్న కార్పొరేష‌న్ ఆర్టీసీ. నిర్వ‌హ‌ణ‌లో ఏ మాత్రం లోటు పాట్లు త‌లెత్తిన‌ప్ప‌టికీ.. దాని ప్ర‌భావం వెనువెంట‌నే ప్ర‌జ‌ల‌పై ప‌డుతుంది. ఆర్థిక దుర్వినియోగాన్ని అరిక‌ట్టి, సంస్థ ఎదుర్కొంటున్న న‌ష్టాల‌ను త‌గ్గించ‌డానికి అధికారులు రూపొందించే ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క్కాగా అమ‌లు కావ‌డానికి రోజా ముక్కుసూటిత‌నం స‌రిపోతుంద‌ని జగన్ భావిస్తున్నారట.

అదే జ‌రిగితే ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితులైన రెండో మ‌హిళా రాజ‌కీయ నాయ‌కురాల‌వుతారు రోజా. ఇదివ‌ర‌కు దివంగ‌త మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యారు. టీడీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఆమెను ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నామినేట్ చేశారు. ఇప్పుడు జగన్.. రోజాను నియమిస్తే.. విభ‌జ‌న త‌రువాత ఏర్పాటైన ఆర్టీసీకి తొలి మ‌హిళా ఛైర్‌ప‌ర్స‌న్‌గా రోజా రికార్డు సృష్టిస్తారు.