ఇవి నంది అవార్డులు కావట...

 

ఏపీ ప్రభుత్వం అంటేనే ఒంటి కాలుమీద లేచే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా నంది అవార్డుల మీద జరగుతున్న రచ్చపై ఇంకా స్పందించడం లేదు ఏంటబ్బా అనుకున్నారు. అలా అనుకున్నారో లేదో.. రోజక్క నంది అవార్డులపై స్పందించి కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. అవి నంది అవార్డులు కాదు.. నారా అవార్డులు అంటూ పంచ్‌లు విసిరారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపయోగపడే విధంగా అవార్డ్స్‌ను ప్రకటిచారనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడన్నారు. ఈ అవార్డ్స్ కేవలం తన వారి కోసమే అన్నట్లు ఉన్నాయని.. ఇక్కడ కులం, జాతి అంటే ఫీల్ అవుతారని, ఈ మూడేళ్లలో ఎన్ని మంచి సినిమాలు వచ్చాయి.. ఎంత మంది మంచి నటులు ఉన్నారు? వాళ్లందర్నీ కాదని వాళ్ల వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకుని నంది అవార్డ్స్‌కు ఉన్న విలువను దిగజార్చారంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు రోజా. నంది అవార్డ్స్‌ అంటే వాటికో గుర్తింపు ఉందని వీళ్లు చేసిన పనికి వాటి స్థాయి పడిపోయిందన్నారు. కాగా 2014, 2015, 2016 మూడు సంవత్సరాలకు ఒకేసారి అవార్డ్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే దుమారం రేగుతున్న సంగతి కూడా విదితమే...