కాంగ్రెస్ కి పినపాక ఎమ్మెల్యే రాజీనామా

 

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆర్ఎస్ గాలి వీస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం డీలా పడింది. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో టీఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేసింది. కానీ గత కొంతకాలంగా ఈ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను పార్టీ ఖండించింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో పార్టీలో డీసీసీ అధ్యక్షుడి నియామకం చిచ్చుపెట్టింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నియమించింది పార్టీ అధిష్టానం. అయితే, అధ్యక్ష పదవి ఆశించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి, వరంగల్ జిల్లా ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ పదవుల్లో ఆదివాసీలకు ప్రాధాన్యమివ్వాలని గతంలోనే అధిష్ఠానానికి విన్నవించినా ఫలితం లేదని, గిరిపుత్రులకు న్యాయం జరగడం లేదని రేగా కాంతారావు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తన సొంత ప్రాంతమని, స్థానికంగా డీసీసీ అధ్యక్షుని నియామకం విషయం తనతో చర్చించలేదని వాపోయారు. తన రాజీనామా పత్రాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి పంపించారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తల కొనసాగుతానని ప్రకటించారు. అసంతృప్తి ఎంత వరకు దారితీస్తుందో? పార్టీ అధిష్టానం బుజ్జగించకుంటే పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదు.