TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పులపాలైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published on: Wed May 8, 2019 4:33PM

 

కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో కూరుకుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే నేతల గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని జగ్గారెడ్డి చెప్పారు.

కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ ఇన్ చార్జి కుంతియాలు అమ్ముడుపోయారన్నది సరికాదన్నారు. వీళ్లిద్దరినీ ఎవ్వరూ కొనలేరని తేల్చిచెప్పారు.

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్.. పార్టీ ఎదుగుదల, పటిష్టత కోసం పనిచేశారని జగ్గారెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఉత్తమ్ పనిచేశారనడం సరికాదని వ్యాఖ్యానించారు. పార్టీ కేడర్ లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారని అభిప్రాయపడ్డారు. పీసీసీతో పాటు పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో పనిచేసినప్పుడే కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని స్పష్టం చేశారు.