TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంటా రాజీనామా 'గంట' మోగేనా..!?

Published on: Mon Mar 14, 2022 12:57PM

ఆయ‌న ఎగిరిఎగిరి ప‌డుతున్నారు. అంతా ప‌ద‌వుల కోసం ఆరాట‌ప‌డుతుంటే.. ఆయ‌న మాత్రం త‌న‌కొద్దీ ప‌ద‌వి అంటూ తెగ మొర‌పెట్టుకుంటున్నారు. తాను చేసిన రాజీనామాను ఆమోదించ‌మంటూ తెగ వేడుకుంటున్నారు. మొద‌ట్లో విశాఖ ఉక్కు కోస‌మంటూ ఉత్తుత్తి రాజీనామా డ్రామా చేశారు. తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో.. నిజంగా స్పీక‌ర్ ఫార్మాట్‌లో రిజైన్ చేశారు టీడీపీ నుంచి గెలిచిన‌ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు. అయినా, త‌న‌ రాజీనామాకు మోక్షం రావ‌ట్లేదంటూ తెగ ఇదైపోతున్నారు. తాజాగా, మ‌రోసారి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంకు విజ్ఞ‌ప్తి చేశారు. 

ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు గంటా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను గంటా కోరారు.   

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచారు. తాను గెలిచినా.. త‌న పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. గెలిచిన‌ప్ప‌టి నుంచి సైడ్ అయిపోయారు. టీడీపీతో ట‌చ్‌లో లేకుండా పోయారు. బ‌డా వ్యాపార‌వేత్త కావ‌డంతో.. ప‌వ‌ర్ లేకుండా ఉండ‌లేరు గంటా. అందుకే, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా చేసినా.. ఇప్పుడు అధికారంలో లేని కార‌ణంగా టీడీపీతో తెగ‌దెంపులు చేసుకొని.. వైసీపీలో చేరిపోవాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. అయితే, ఆయ‌న ఆశ‌కు.. మంత్రి అవంతి శ్రీనివాస్ ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతున్నారు. గంటా నేనొస్తానంటే.. అవంతి మాత్రం నేనొద్దంటా.. అంటూ వైసీపీలోకి రానీయ‌కుండా అడ్డుకుంటున్నారు. విశాఖ‌లో గంట వ‌ర్సెస్ అవంతి పోట్లాట అంద‌రికీ తెలిసిందే. మంత్రి మాట కాద‌న‌లేని వైసీపీ అధిష్టానం.. గంటా రాజీనామాకు, పార్టీలో చేరిక‌ను.. ప‌దే ప‌దే వాయిదా వేస్తూ వ‌స్తోంది. 

ఎమ్మెల్యేగా ఉన్నా.. లేన‌ట్టుగానే ఉంది గంటా దుస్థితి. టీడీపీ మాత్రం ఎన్ని అవ‌కాశాలు ఇచ్చినా.. గంటా కాల‌ద‌న్నుకుంటున్నారు. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర మీటింగ్‌కు సైతం డుమ్మా కొట్టారు. పిలిచినా ముఖం చాటేస్తున్నారు. అటు, వైసీపీ సైతం గంటాతో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టే ఉంటోంది. దీంతో.. ఇటు టీడీపీలో లేక‌.. అటు వైసీపీ కండువా క‌ప్పుకోలేక‌.. అటూ ఇటూ ఎటూ కాకుండా పోయారు గంటా శ్రీనివాస‌రావు. అందుకే, క‌నీసం త‌న రాజీనామా ఆమోదం పొందితేనైనా.. త‌న పేరు, త‌న ఉనికి మ‌రోసారి గ‌ట్టిగా వినిపిస్తుంద‌ని భావిస్తున్నారో.. లేక‌, ఎలాంటి ప్ర‌యోజ‌నం లేని ఎమ్మెల్యే ప‌ద‌వి ఉండి ఏం లాభం లేద‌ని.. రాజీనామాతో క‌నీసం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప‌ద‌విని త్యాగం చేసిన వాడిగానైనా మిగిలిపోతాన‌ని అనుకుంటున్నారో ఏమో.. త‌న రాజీనామాపై స్పీక‌ర్ త‌మ్మినేనిపై మ‌రోసారి ఒత్తిడి పెంచారు. మ‌రి, గంటా రాజీనామా గంట మోగుతుందో లేదో చూడాలి...