ఒక పరాజయం 100 తప్పులు.. ఆ 60 మంది ఎమ్మేల్యేలే కొంప ముంచారు

 

టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో.. అభ్యర్థులను మార్చకపోవడం కూడా ఒకటని చెప్పవచ్చు. ఎంతసేపూ చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని.. నేను కష్టపడ్డాను, నన్ను చూసి ఓటేయండి అన్నారు. అంటే బాబు చెప్పాడుగా అని నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా ప్రజలు ఓటేస్తారా?. వారికి స్థానికంగా అందుబాటులో ఉండాల్సింది బాబా? ఎమ్మెల్యేనా?. వివాదాలు, అవినీతి ఆరోపణలు, దందాలు, ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోకి రావడం. ఇలాంటి వారు అభ్యర్థులైతే బాబు చెప్పారుగా అని ప్రజలు ఎందుకు ఓటేస్తారు?. ఈ మాత్రం ఆలోచన 40 ఏళ్ళ అనుభవం ఉన్న బాబుకి రాలేదా?.

గత ఐదేళ్లల్లో ఎందరో ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఎందరి మీదనో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇలా రకరకాల కారణాలతో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారికి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బాబు ఇవన్నీ పట్టించుకుంటేనే కదా. ప్రజలు నన్ను చూసి ఓటేస్తారు అంటూ అతి నమ్మకంతో అభ్యర్థులను మార్చకుండా ఎన్నికల పోరులోకి దిగారు. ప్రజాతీర్పు చూసి డీలా పడిపోయారు.

బాబు.. ముందే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత గుర్తించి అభ్యర్థులను మార్చి ఉంటే టీడీపీకి ఘోర ఓటమి ఎదురయ్యేది కాదుగా. ముందు నుండి పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారిని అభ్యర్థులగా నిలబెడితే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోయి తన మీద విమర్శలు చేస్తాడేమో అన్న భయంతో కొందరికి, ఇతనైతేనే ఆర్థికంగా బలవంతుడు అని మరికొందరికి టికెట్లు ఇచ్చారు. అలాంటి వారి కోసం కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేయగలరా? ప్రజలకు వారికి ఓటేయాలని అనిపిస్తుందా?. ఖచ్చితంగా అనిపించదు.

పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతూ.. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటే.. అలాంటివారి కోసం కార్యకర్తలు నిజాయితీగా కష్టపడతారు. అలా కాకుండా పార్టీలు జంప్ చేసేవారిని, కేవలం డబ్బే ఉన్న వారిని తీసుకొస్తే.. వీళ్ళు గెలిచినా పార్టీలో ఉంటారో లేదో తెలీదు. ప్రజలకూ అందుబాటులో ఉండరు అని కార్యకర్తలు పని చేయడం మానేస్తారు. ఆ అభ్యర్థులను కార్యకర్తలే నమ్మకపోతే ఇక సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?. అందుకే బాబు అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెప్పినా.. ప్రజలు మాత్రం వారి నియోజకవర్గాల్లోని అభ్యర్థులనే చూసారు. టీడీపీకి ఘోర ఓటమి రుచి చూపించారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ లో కోహ్లీ ఒక్కడే బాగా ఆడినంత మాత్రాన ప్రతిసారి మ్యాచ్ గెలుస్తామా? మిగతా బ్యాట్స్ మెన్, బౌలర్ల సపోర్ట్ కూడా ఉండాలి. టీం ఎఫర్ట్ ఉండాలి. మరి వీక్ టీం ని పెట్టుకొని బాబు 'నేను కష్టపడ్డ, నన్ను చూసి ఓటేయండి' అంటే ప్రజలు పార్టీని ఎలా గెలిపిస్తారు?. ఇది చంద్రబాబు ఆలోచించలేకపోయారు. అందుకే ఓడిపోయారు.