బాలయ్యకు వైసీపీ సెగ.. హిందూపురంలో హైటెన్షన్

బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యే. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం బాలయ్యకు ఎదురు లేకుండా పోయింది. మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూపురం గడ్డ.. బాలయ్య అడ్డ. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా నిలిచిన బాలయ్యకు తాజాగా వైసీపీ సెగ తగిలింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలయ్య. మోత్కుపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రచారం చేయనీయకుండా అడ్డుకోవడంతో మోత్కుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. 

జై జగన్ నినాదాలు చేస్తూ బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మోత్కుపల్లి రావడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తలకు పోటీగా, బాలయ్యకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు సైతం భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు మోహరించడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సవాల్ గా మారింది.