లాక్‌డౌన్ వేళ‌ స్ఫూర్తిగా నిలిచిన క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యే!

మారుమూల గ్రామా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులందించ‌డానికి జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు ప‌డుతున్న ఆరాటానికి ఈ ఫొటో సాక్ష్యం. రోడు మార్గం లేక‌పోయిన‌ప్ప‌ట్టికీ నదిని సైతం లెక్క‌చేయ‌కుండా భుజాన సంచి వేసుకొని రోడ్డు బాట ప‌ట్టిన వీరు దేశంలోని ఇత‌ర  అధికారుల‌కు,   నేత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచారు. రైస్ బ్యాగ్ భుజాన వేసుకున్న వ్యక్తి కలెక్టర్, పిబి.నోవా ఐఎఎస్‌.  పతనమిట్ట జిల్లా క‌లెక్ట‌ర్. కేరళ  రాష్ట్రం.

ఈ ఐఎఎస్ అధికారితో పాటు బ్యాగ్ పట్టుకున్న మరొక వ్యక్తి పతనమిట్ట ఎమ్మెల్యే, జనీష్ కుమార్, ఇద్దరూ ఇతర అధికారులతో పాటు ఒక మారుమూల గ్రామానికి బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకువెళుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రిస్తూ ఆద‌ర్శంగా నిలిచారు. వీరిని చూస్తుంటే మ‌న ద‌గ్గ‌ర శాస‌న‌స‌భ్యులు, ఐఎఎస్ అధికారులు ఎలా వుంటారో ఒక సారి త‌ల‌చుకుందాం!

ఒక్కసారి MLA అయితే, ఆయన లేక ఆమె, దేవుడి కంటే ఎక్కువ, ఇంకా మాట్లాడితే ట్రంప్ కంటే ఎక్కువ అని ఫీల్ అయిపోతారు. భూమి మీద నడవడం మానేస్తారు. 

మిగతగా రాష్ట్రాల కలెక్టర్ల గురించి నేను చెప్పలేను గానీ, మన రాష్ట్రంలో, శంకరన్ లాంటి వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు...ఈ కన్ఫర్డ్ ఐఏయెస్ వచ్చి, కలెక్టర్లు అయ్యే వారు ఇంకా ఘోరం. అప్పటి దాకా ఆర్డీవో గా ఉండి నమస్కారాలు పెట్టి, ఒక్క సారి ఐఏయెస్, వచ్చి కలెక్టర్ కాగానే ఇక ఆ హంగు, దర్జా, ఆ హంగామా చూడాల్సిందే...

ఇక రాజకీయాల ఎమ్మెల్యే లు. అసలు వీళ్ళు డెమీ గాడ్స్. చంద్ర బాబులు, జగన్, కేసీఆర్లు గౌరవంగా మాట్లాడుతారు, కొంచమైనా భూమి మీద వుంటారు. ఈ ఎమ్మెల్యేలు మాత్రం, ఈ ఐదేళ్లలో ఏ పని చేసినా నెక్స్ట్ ఎన్నికలకు నాకు పనికి వస్తుందా? పనికొస్తేనే చేస్తా..లేకపోతే చెయ్య...అంతే...ఏ పార్టీ అయినా సరే...

ఎమ్మెల్యే సారు బయటకు వస్తే, నాలుగు కార్లు, గన్ మెన్లు, ఎస్కార్ట్ పోలీస్ వ్యాను, లోకల్ ఎస్సై, కానిస్టేబుళ్లు, బౌన్సర్లు, అనుచరులు, అర్జీదారులు, అధికారులు, వందిమాంగదులు,... అబ్బో, ఎందుకులే, చూసి తీరాలి... మరీ చిన్న టవున్స్ లో మరీ ఎక్కువ...ఎమ్మెల్యే గారి ఆర్ధిక పరిస్థితి, రాజకీయాల్లో సీనియారిటీని బట్టి కొంచం హెచ్చు తగ్గులు....అంతే...సారు బజార్లోకి వస్తే ఒక పది కార్ల కాన్వాయ్ వుండాలంతే...

ఇక ఎమ్మెల్యే ఓ యాభై ఏళ్ళ వారైతే, ఒకప్పట్లో, కొడుకు, ఇప్పుడు కొడుకు, కూతురైనా సరే, ఒక యువజన విభాగం వుంటుంది. చిన్న చిన్న పంచాయితీలు, వసూళ్లు, ధర్నాలు అన్నీ, నాన్నకి శ్రమ తగ్గించేందుకు వీళ్ళు చేస్తుంటారు....మరి బాబు...లేక అమ్మాయి గారు, ఎమ్మేల్యే గారి వారసత్వం తీసుకోవద్దేటి? ఏటి సెప్తావు నువ్వు?

ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ..ఇక అంతే...ఆ ఊరికి ఆయనే రాజు, పాలేగారు, చక్రవర్తి. పైన చెప్పిన వారందరితో పాటు, ఎమ్మార్వో, ఎండీవో, వ్యవసాయ ఆఫీసరు, పశువుల డాక్టరు, మొదలుకొని, ఆయన వున్న మండల అధికారులు మొత్తం హాజరు...ఇక చిన్న టవున్ అయితే మునిసిపల్ సిబ్బంది...

మరి వీళ్ళందరి ఖర్చు? తన అనుచరుల ఖర్చు, సారే భరిస్తారు. మధ్యాహ్నము భోజనం, వెహికళ్ళు, డీజల్, డ్రైవర్ ఖర్చులు, ...ఎమ్మెల్యే సారు గ్రామాలకు వెళ్లి, అలనాటి కృష్ణదేవరాయలు లాగా చేసే దానాలు, పెళ్ళిలకు చదివింపులు, అన్నీ ఈయనే భరిస్తారు... ఓ మాదిరి టవున్స్ లో ఎమ్మెల్ల్యేలకు రోజుకు మినిమం ఖర్చు పాతిక వేల అవుతుందట...ఆంధ్రాలో...  మరీ ఈ డబ్బంతా వచ్చేదెలా సారుకు..... 
ఇంజనీరింగ్ ఏఈ లు, డీఈ లు, ఎప్పుడూ సారుకు ఫోన్ లో అందుబాటులో వుండాలి....ఎప్పుడు ఫోన్ చేసినా టకీమని ఆన్సర్ చెయ్యాలి...లేకపోతే బూతులు తిట్టే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నేనే... చూసాను. ఇక పోలీస్ స్టేషన్ లో కేసులు అన్నీ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే జరుగుతాయి. పంచాయితీలు అన్నీ సారే చేస్తారు...తన దగ్గర ఓ పడేళ్ళు నమ్మకంగా ఉంటే వారికి మార్కెట్ యార్డ్ చెర్మన్లు, డైరెక్టర్లు, ప్యాక్స్ చెర్మన్లు లాంటి పదవులు ఇప్పిస్తారు....సరే ఇక వాటి వసూళ్లు, అవి మామూలే...

ఏ ప్రాజెక్టు వచ్చినా సార్ కు తెలియకుండా రాదు...సార్ కు వాటా ఇవ్వకుండా పోలేదు. జరిగే ప్రతి పనిలో, సార్ కు వాటా ఇవ్వాల్సిందే... అదేమీ లేదు అని వాదిస్తారు కానీ, జరిగే సత్యం అంతే..

బాగా సంపాదించటం, దానిలో కొంత రోజు వారీ మెయింటెనెన్స్ కు, ఆనుచరుల కోసం కొంత, ఎన్నికలప్పుడు ఖర్చు, డబ్బు పంపకం కోసం...వీటనన్నింటికి పోగా సారుకు ఒక టర్మ్ కు , అంటే ఐదేళ్లకు ఒక పది పదిహేను కోటలైనా మిగిలితే , మరుసటి సారి ఎమ్మెల్యే గా కొనసాగచ్చు...

అంటే, ఒక ఎమ్మెల్యే, ఇష్టం వున్నా లేకపోయినా, దర్బార్ మెయింటెయిన్ చెయ్యాలి, సంపాదించాలి...తప్పదు....పులి స్వారీ...అంతే. ఇష్టమయ్యే చేస్తారు కాబట్టి, పులి స్వారీ లాగా ఫీల్ కారు..

నాకున్న పది పన్నెండేళ్ల రాజకీయ అనుభవంలో, దేశ రాజకీయ స్థితి మారాలంటే, ఈ ఎమ్మెల్యే వ్యవస్థ మారాలి.... వీళ్ళు చెప్పినట్టే రాష్ట్ర పార్టీ అధినేత కూడా వినాల్సిన స్థాయికి వచ్చేసారు....కాదంటే, పార్టీ మారిపోతారు మరి. అప్పటికే అధికారంతో వెళ్ళొనుకు పోయివుంటారు కాబట్టి, వాళ్ళు చెప్పిందే వేదం...ఓట్లు కూడా వాళ్ళవే.... వారి మాట వినాల్సిందే ...తప్పదు.

ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అలా చేయకపోతే, వేస్ట్.. ఈ ఎమ్మెల్యే అనేస్తారు.... ప్రత్యర్థి ఎప్పుడూ ఉంటాడు కదా...అతని దగ్గర చేరిపోతారు...అందుకని, ఇష్టం వున్నా లేకపోయినా, అందరూ ఈ చట్రంలో భాగం అయిపోతారు...

అధికారం మొత్తం ఒకరి చేతిలో కేంద్రీకృతం అయ్యే ఈ ఎమ్మెల్యేల వ్యవస్థ ఇలాగే కొనసాగితే, మనం గొప్పగా చెప్పుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థ అసెంబ్లీ బోర్డులో మాత్రమే మిగులుతుంది....

మా పార్టీ ఎమ్మెల్యేలు సూపర్ అంటూ రాకండి....అందరూ ఒకే తాను లో ముక్కలే...!