మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో కాంగ్రెస్‌ పెద్దలకూ వాటాలున్నాయా? వాళ్లెందుకు సైలెంట్‌ అయ్యారు

 

అవకాశం అందివస్తే రెచ్చిపోవాలి... చేతికి ఆయుధం దొరికితే సర్కారును దులిపేయాలి... కానీ భారీ కుంభకోణం బయటపడినా... టీకాంగ్రెస్ పెద్దలు మాత్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం జిల్లా నేతలకు పని అప్పచెప్పేసి చేతులు దులుపుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాపెడా వాయించే అవకాశం వచ్చినా... పీసీసీ, సీఎల్పీ పెద్దలు మాట్లాడకుండా తప్పించుకునే యత్నం చేస్తున్నారని అంటున్నారు. మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌పై టీడీపీ దూకుడుగా వెళ్తుంటే.... ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ పెద్దలు మాత్రం చూసీచూడనట్లు పోతున్నారనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి.

 

ఒకవైపు టీడీపీ నేతలు ఫీల్డ్‌ను విజిట్‌ చేయడం... సీఎస్‌కు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్‌ చేయడానికి కూడా టీటీడీపీ సిద్ధమవుతోంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం అప్పుడప్పుడూ ఒక ప్రకటన చేస్తూ తప్పించుకుని తిరుగుతోంది. అయితే కిందిస్థాయి నేతల నుంచి, కేడర్‌ నుంచి విమర్శలు పెరగడంతో ఆలస్యంగా ఫీల్డ్‌ విజిట్ చేసిన టీకాంగ్రెస్‌ పెద్దలు... ఆ తర్వాత గవర్నర్‌‌ను కలిసి మళ్లీ చేతులు దులిపేసుకున్నారు. అయితే తీవ్రస్థాయిలో పోరు చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం...ఇలా వెనుకంజ వేయడం వెనుక మర్మమేమిటో అర్థంకాక కాంగ్రెస్‌ నేతలే బుర్ర బద్దలు కొట్టుకొంటున్నారు.

 

ఇంత పెద్ద స్కామ్‌ బయటపడినా హస్తం నేతలు కిమ్మనకుండా ఉండటంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నారు. మంత్రి హరీష్‌ అన్నట్లుగా మియాపూర్ భూదందా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమవడం ఒక కారణమైతే....స్కామ్‌లో తమ  లింకులూ ఎక్కడ బయపడుతాయోనని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పైగా టీఆర్ఎస్ ఎంపీ కేకే సైతం తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడే భూములు కొనుగోలు చేసినట్లు చెప్పడంతో....తమ వ్యవహారం కూడా బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే భారీ భూ కుంభకోణం గురించి మాట్లాడకుంటా కాంగ్రెస్ సీనియర్లు తప్పించుకుని తిరుగుతున్నారని అంటున్నారు.