మియాపూర్ భూ కుంభకోణం… టీ సర్కార్‌కి కోర్టు కష్టాలు తప్పవా?

 

మియాపూర్ భూ కుంభకోణం పెద్ద మాయాపూర్ భూ కుంభకోణంగా మారిపోయింది! తప్పు కేవలం రిజిస్ట్రేషన్ అధికారులదే అని తెలంగాణ సర్కార్ చెబుతోన్నా వారి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఎట్టి పరిస్థితుల్లోనూ వుండదని ఎవ్వరూ అనలేరు. అసలు పొలిటికల్ మాయ తెర వెనుక లేకుంటే ఎకరాల కొద్దీ భూముల్ని, కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల్ని అధికారులు ఏ ధైర్యంతో తమకు నచ్చిన వారికి ధారదత్తం చేస్తారు? అయితే, వ్యవహారం చూస్తుంటే ఇప్పుడిక రాజకీయ నాయకుల ప్రమేయం పెద్దగా బయటకు వచ్చేలా కనిపించటం లేదు. స్వయంగా కేసీఆర్ కుంభకోణం ఏం జరగలేదని అభిప్రాయపడ్డారు కాబట్టి అధికారుల మీద విచారణలు, చర్యలతోనే సరిపెట్టేస్తుండవచ్చు!

 

టీఆర్ఎస్ నేత కేకే కుటుంబంపైనే ఆరోపణలు రావటంతో ఒక దశలో మియాపూర్ భూకుంభకోణం తెలంగాణ గవర్నమెంట్ మెడకు చుట్టుకున్నట్టే అనిపించింది. కాని, మెల్ల మెల్లగా నయీం కేసులో జరిగినట్టే ఇక్కడా జరిగిపోతోంది! రాజకీయ నేతలు సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. కాని, కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ భూముల్ని రిజిస్టర్ చేయించుకున్న ప్రైవేట్ పార్టీల నుంచి తిరిగి హక్కులన్నీ గవర్నమెంట్ పొందటం అంత ఈజీ కాదట! అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేయించుకున్న వారి డాక్యుమెంట్లు చెల్లవని ఒక నోటిఫికేషన్ ఇవ్వగానే పని పూర్తైపోదంటున్నారు. ప్రభుత్వ భూములన్నీ భద్రంగా సర్కార్ ఆధీనంలోకి రావాలంటే బోలెడంత చట్టపరమైన తతంగం జరగాల్సిందేనట!

 

రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు గవర్నమెంట్ భూముల్ని తమ ఇష్టానుసారం ఎవరెవరికో కట్టబెట్టేశారు. ఇప్పుడు వాట్ని తిరిగి పొందాలంటే ముందుగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 22 కింద భూముల్ని నోటిఫై చేయాలి. ఆన్ లైన్లో ఆయా సర్వే నెంబర్లని మళ్లీ రిజిస్ట్రేషన్ అవ్వకుండా బ్లాక్ చేయాలి. అంతే కాక సదరు భూముల్ని నోటిఫై చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు వున్న వారు తమకు తెలుపవచ్చని కూడా నోటీస్ ఇవ్వాలి. ఇదంతా పూర్తైన తరువాత భూముల అక్రమ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ జీవో జారీ చేయాలి. కాని, ప్రభుత్వం అలా క్యాన్సిల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఎప్పుడూ వుంటుంది. మరో వైపు నిజాం, పయిగా వంశస్థులు సర్కార్ భూములు తమవంటూ, వారు కూడా కోర్టుకు వెళ్లే చట్టబద్ధమైన అవకశాలున్నాయి. ఇలా కోర్టులో లిటిగేషన్లు మొదలైతే మియాపూర్ భూముల వ్యవహారం తేలటానికి ఏళ్లు పడుతుంది!

 

సర్కార్ చెబుతున్నట్టు ఒక్క సెంటు భూమి కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లనప్పటికీ ముందు ముందు చాలా పెద్ద న్యాయ పోరాటం తప్పదనేది ఇప్పుడు స్పష్టం. అలాగే, రాబోయే ప్రతీ గవర్నమెంటు దీనిపై ఎంతటి చిత్తశుద్ధితో కోర్టులో పోరాడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక జనం కొంచెం భూమి కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకూడదని కోరుకోవటం తప్ప చేయగలిగిందేం లేదు!