గవర్నెమెంట్ స్కూల్, హాస్పిటల్ వద్దు! గవర్నమెంట్ ఉద్యోగమెందుకు ముద్దు?

 

ఇండియాలో ఎక్కడికెళ్లినా ఏ మాత్రం మారని ట్రెండ్… గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనంలో వుండే భయం, చిరాకు! కాని, అదే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాత్రం జనం ముఖంలో మెరుపు కనిపించేస్తుంది! అసలు మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగానికి వున్నంత క్రేజ్ బహుశా ఇంక దేనికీ లేదనుకుంటా! అందుక్కారణం కూడా కొంచెం ఆలోచిస్తే తేలిగ్గానే దొరికిపోతుంది మనకి!

 

తెలంగాణలో కలకలం రేపుతోన్న మియాపూర్ భూ కుంభకోణం అందరికీ తెలిసిందే! ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నేతల పేర్లు, వారి కుటుంబీకుల ప్రమేయాలు రోజూ వార్తలో కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. అయితే, బడా నాయకులు మియాపూర్ భూముల కారణంగా ఎంత సంపాదించుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. కాని, కేవలం ఒక సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో పని చేసిన శ్రీనివాసరావు మాత్రం వినేవారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా అవినీతి సొమ్ము పోగేశారట!

 

కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన ఆయన తన బావమరిదికి చెందిన నార్త్ స్టార్ ప్రాజెక్ట్స్ సంస్థ, మరణించిన తన భార్య పేరు మీదున్న జయశ్రీ ప్రాజెక్ట్స్ తో పాటు, తన కుమారుడి హాసిని ప్రాజెక్ట్స్ సంస్థ పేరు మీద భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. అంతే కాదు, మొత్తం పది బ్యాంకుల్లో అకౌంట్లు వున్నట్టు కూడా పసిగట్టారు. పదిహేడు క్రెడిట్ కార్డ్ లు కూడా అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకుంది. ఇక ఫైనల్ గా ఇప్పడు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు మొత్తం అక్రమ సంపాదన 2వందల కోట్ల పైమాటే అంటున్నారు అఫిషియల్స్!

 

ఒక గవర్నమెంట్ అధికారి వలలో చిక్కితేనే వందల కోట్లు బయటపడుతుంటే ఇక గవర్నమెంట్ నడిపే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వగైరా వగైరా ఎంత వెనకేసుకుంటూ వుంటారంటారు? ఇటు గవర్నెంట్ ఉద్యోగుల్లోనూ, అటు గవర్నమెంట్ పెద్దల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ మంచి వాళ్లు వుండొచ్చు. కాని, వారి కంటే రోజు రోజుకు ఇలాంటి అవినీతి చేపలు, తిమింగలాలు, షార్కుల సంఖ్యే ఎక్కువైపోతుంది. ఒక్కో అవినీతి అధికారే వందల కోట్లు నొక్కేస్తుంటే ఇంకా పై స్థాయిలోని నేతలు, కార్పోరేట్ బాస్ లు ఇంకే రేంజులో దేశాన్ని దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు!

 

గవర్నమెంట్ నౌకరీలో ఇంత గిట్టుబాటు వుండటంతోనే చాలా మంది పేద, మిడిల్ క్లాస్ ఇండియన్స్ గవర్నమెంట్ జాబ్ కోసం తలకిందుల తపస్సు చేస్తుంటారు. ఉద్యోగం వచ్చాక అందరూ అవినీతిపరులైపోతారని మనం చెప్పలేం. కాని, అత్యధిక శాతం అక్రమ మార్గంలోకే జారిపోతున్నారు. ఇది దేశం సంక్షేమానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్యూన్ నుంచీ ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఎవరికి వారు అవినీతి చేస్తూ పోవటం అంటే… ఆత్మహత్య చేసుకోవటం లాంటిదే!