TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

Published on: Sun Sep 28, 2025 4:44PM

 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు.ఇవాళ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత ఈ పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్‌గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు.

గత ఆగస్టులో రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నుంచి మిథున్ మన్హాస్ పేరు నామినేట్ చేయబడగా, చివరికి ఏజీఎంలో ఆయన అధికారికంగా ఎన్నికయ్యారు.

ఈ సమావేశంలో ఇతర కీలక పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా కొనసాగగా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు.

మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆనందం వ్యక్తం చేస్తూ, “జమ్మూకశ్మీర్‌లోని దూరప్రాంతం దోడాకు చెందిన మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చారిత్రక ఘట్టం” అని వ్యాఖ్యానించారు.

దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున 147 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,714 పరుగులు చేసిన మన్హాస్, అనంతరం జమ్మూకశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా కూడా సేవలందించారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడిన ఆయన, తన అనుభవం, మృదుస్వభావం వల్ల భారత క్రికెట్‌కు కొత్త దిశనిస్తారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.