పాపం ఏపీ సర్కార్.. సుప్రీం లో మరో సారి తప్పులతో పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసందే. హైకోర్టు ఉత్తర్వు పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ లో పలు తప్పులు దొర్లడంతో అవి వెనక్కి వచ్చాయి. ఈ పిటిషన్ లో స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం పేర్లు తప్పుగా పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి కూడా సరిగా పేర్కొనలేదు. దీంతో తప్పులు సరి చేసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఇప్పటికే ఈ పిటిషన్ పై త్వరగా విచారించాలని మరో అప్లికేషన్ పెట్టగా అసలు పిటిషన్ లో తప్పులు బయట పడడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది

 

ఈ నెల 16న శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్న ఏపీ సర్కార్ ఇపుడు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా మరో పక్క సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. దీంతో రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. మరో పక్క ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు నిమ్మగడ్డ కేసు విషయంలో కూడా తప్పులతో కూడిన పిటిషన్లు వేయడంతో ఒక సారి వెనక్కి వచ్చాయి.