TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యే మిస్సింగ్‌.. ఏపీలో కలకలం..

Published on: Wed Jan 19, 2022 2:04PM

జ‌గ‌న్ ఒక్క‌ఛాన్స్ అంటే న‌మ్మారు. జ‌గ‌న్‌ను చూసి ఓటేశారు. ఊరూపేరూ లేని వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారు. తామెంత పెద్ద త‌ప్పు చేశామోన‌ని ఇప్పుడు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ముఖ్య‌మంత్రితో స‌హా.. వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రిపై ప్ర‌జ‌లు అస‌హ‌నం, ఆగ్ర‌హంతో ఉన్నారు. అభివృద్ధి లేక‌, రోడ్లు లేక‌, ఇసుక లేక‌, ఉపాధి లేక‌, నిధులు లేక‌, స‌మ‌యానికి జీతాలు లేక‌... ఇలా ఈ లేక‌..లేక‌..లు చాలానే ఉన్నాయి. 

య‌ధారాజా త‌ధా ఎమ్మెల్యే అన్న‌ట్టు ఉంది నేత‌ల తీరు. ముఖ్య‌మంత్రేమో తాడేప‌ల్లి ప్యాలెస్ వీడి బ‌య‌ట‌కు రారు.. ఇక ఎమ్మెల్యేలేమో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌రు. స‌మ‌స్య వ‌స్తే ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కాదు. అందుకే, ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందిన ప్ర‌జ‌లు.. ప‌లు విధాలుగా త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఆ ప్ర‌జాసెగ గ‌ట్టిగానే త‌గిలింది. 

ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి.. కనిపించడం లేదంటూ ప్ర‌జ‌లు పోస్టర్లు వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. "ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలపగలరు. ఇట్లు.. గుంజేపల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం" అంటూ పోస్టర్లు వేశారు. 

వైసీపీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి తమ గోడు వినిపించుకోకపోవడంతో ఇలా పోస్టర్ వేశామని గుంజేప‌ల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతోంది. ఈ పోస్ట‌ర్‌పై ఎమ్మెల్యే రియాక్ష‌న్ ఎలా ఉంటుందో మ‌రి...