యువతులకు మిస్డ్ కాల్స్ ఇచ్చారో... అంతే..
Published on: Wed Sep 24, 2014 6:33PM

మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు బీహార్ పోలీసులు చెక్ పెట్టారు. మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే విషయం అటుంచితే, ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నా అరెస్టు చేసి లోపలవేసి తాట తీయడానికి బీహార్ పోలీసులు రంగం సంద్ధిం చేశారు. ఇకపై మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్ట్ కాల్స్ చేస్తే జైలు కటకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని బీహార్ రాష్ట్ర సీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు. ఈ మేరకు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని బీహార్లోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. పదే పదే మిస్డ్ కాల్స్ చేయడం వల్ల యువతులు అభద్రతా భావానికి గురికావడంతోపాటు మనశ్శాంతిని కూడా కోల్పోతూ వుంటారని అన్నారు. ఆ సమస్యను నివారించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాండే చెప్పారు. ఇలా మహిళలకు మిస్డ్ కాల్స్ చేసేవారిమీద 354 డి 1, 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.


