17 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ వరల్డ్

సుమారు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారతదేశానికి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. చైనాలోని సాన్యాలో జరిగిన 67వ మిస్ వరల్డ్ ఫైనల్లో మనదేశానికి చెందిన మానుషి ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 118 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను పక్కకునెట్టి మానుషి మిస్ వరల్డ్‌గా నిలిచింది. ఫైనల్ సందర్భంగా న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు ఆలోచింపచేశాయి. ప్రపంచంలో అత్యధిక వేతనం ఇవ్వాల్సిన వృత్తి ఏదీ..? అన్న ప్రశ్నకు అమ్మ అని సమాధానం ఇచ్చింది మానుషి. జీతమంటే డబ్బు మాత్రమే కాదని నేను భావిస్తున్నా ప్రేమ, గౌరవం, వీటిని మించిన జీతం ఏముంటుంది. అమ్మతనానికి, పిల్లల కోసం తల్లులు చేసే త్యాగాలకు ఈ ప్రపంచంలో అత్యధిక వేతనం అందించాలి అనగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. ఆ కాసేపటికే ఛిల్లర్‌ను మిస్ వరల్డ్ కిరీటం వరించింది.

భారత్‌కు ఇది ఆరోసారి:
మానుషి ఛిల్లర్‌ సాధించిన కిరీటంతో కలిపి భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ దక్కినట్లయ్యింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తాముఖీ, 2000లో ప్రియాంక చోప్రాలు ఈ ఘనత సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.