బెంజ్ కంపెనీ తన నిర్లక్ష్యానికి మూల్యం, కోర్టులో చెల్లించనుందా?


 

స్టేజీ పైన కొనసాగే నాటకం లాంటిది లైఫ్ అంటాడు ఒక ఆంగ్ల కవి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు కుదిపేసినా జీవితం ముందుకు పోతూనే వుండాలి. ఏపీ మంత్రి నారాయణ ఇప్పుడు అలాంటి విషాద స్థితిలోనే వున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు యాక్సిడెంట్లో చనిపోవటంతో ఆయన తీవ్రంగా క్రుంగిపోయారు. అయినా కూడా జీవితం ఎవరి కోసమూ ఆగదు కదా? ముందుకు కదులుతూనే వుండాలి…

 

నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మెట్రో రైల్ కోసం నిర్మించిన పిల్లర్ కి కార్ ను ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. దీనికి ప్రధాన కారణం అతి వేగమే అన్నది దాదాపుగా రూఢీ అయింది. అయితే, నిషిత్ స్వయంకృతం ఎంత వున్నా కార్ లోని సెక్యూరిటీ ఫీచర్స్ ఏమయ్యాయని చాలా మందికి ఇప్పటికీ అనుమానంగానే వుంది. కోట్లు విలువ చేసే బెంజ్ కార్లో అసాధారణ రక్షణ వ్యవస్థలుంటాయి. అవన్నీ ఎందుకు పని చేయలేదన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న!

 

అత్యంత ఖరీదైన కారు, పైగా మృతి చెందింది మంత్రి కుమారుడు కావటంతో జర్మనీ నుంచీ బెంజ్ కంపెనీ ప్రత్యేకంగా తమ బృందాన్ని దర్యాప్తు కోసం హైద్రాబాద్ కు పంపిందట. వారి విచారణలో నిషిత్ కార్ లో లోపాలున్నాయని తేలిందంటున్నారు. బెంజ్ కంపెనీ కార్ అమ్మే సమయంలో ఇచ్చిన రక్షణ హామీలేవీ యాక్సిడెంట్ సమయంలో పని చేయలేదు. అందుకే, నిషిత్ మృతి చెందడమే కాక కార్ కూడా దారుణంగా దెబ్బతిన్నది. ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫీచర్స్ విఫలమవ్వటం వల్లేనని బెంజ్ టీమ్ రిపోర్ట్ తయారు చేసింది.

 

జర్మనీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులే కార్ లో లోపాలు వున్నాయనటంతో మంత్రి నారయణ న్యాయ పోరాటం దిశగా కదులుతున్నారని టాక్. బెంజ్ ను కోర్టుకు ఈడ్చి బుద్ది చెప్పాలని భావిస్తున్నారట.

 

కోర్టుకి వెళ్లినంత మాత్రాన చనిపోయిన కుమారుడు తిరిగి రాకున్నా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అయిన బెంజ్ ముందు ముందు ఇలాంటి ప్రాణంతకమైన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వుంటుంది. ఒకవేళ నారాయణ కోర్టు మెట్లు ఎక్కితే దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కోట్లూ వసూలు చేసే బడా కంపెనీలు కనీస బాధ్యత లేకుండా వాహనాలు తయారు చేయటం క్షమించరాని నేరం. పూడ్చుకోలేని నష్టం.