TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ తీరుపై ఆ ఇద్దరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే నోరు విప్పడం లేదా?

Published on: Tue Oct 15, 2019 11:19AM

 

ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతోపాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దాంతో కేసీఆర్ సర్కారుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వ్యవహరిస్తోంది. అయితే, కార్మికుల ఆవేదనతోపాటు విపక్షాల ఆరోపణలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వం కూడా కౌంటర్ మొదలుపెట్టింది. మంత్రులు సైతం ఆర్టీసీ నేతలు, విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఎదురుదాడి చేస్తున్నారు. కార్మికుల జోలికి పోకుండా... సంఘాల నేతలు, విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, మంత్రులందరూ నోరు విప్పుతున్నా... ఇద్దరు ముగ్గురు మాత్రం మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆర్టీసీ కార్మిక నేతలు, విపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో... కౌంటర్ ఇవ్వాలంటూ ఇద్దరు ముగ్గురు మంత్రులు మిగిలిన మంత్రులందరికీ ప్రగతిభవన్ నుంచి ఫోన్లు వెళ్లాయట. ఏం మాట్లాడాలో డైరెక్షన్ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారట. అయితే, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటం... పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కావడంతో... ఆయన్ను నోరు విప్పొద్దని పార్టీ పెద్దలు వారించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి... కాంగ్రెస్‌ నుంచి రావడంతో సమ్మెపై మాట్లాడితే విమర్శలు వస్తాయని వద్దన్నట్లు తెలిసింది. దాదాపు ఇలాంటి కారణంతోనే మంత్రి మల్లారెడ్డిని కూడా వద్దని చెప్పారట. వీళ్లు కాకుండా, మిగతా మంత్రుల్లో పలువురు మీడియా ముందుకొచ్చి రెండ్రోజులుగా ఆర్టీసీ సమ్మెపై, విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు.

అయితే, మంత్రులందరూ స్పందిస్తున్నా, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు, ఈటల రాజేందర్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. హరీష్‌... యూనియన్ ఆవిర్భావం నుంచి గౌరవ అధ్యక్షులుగా ఉండటంతో... ఆయన స్పందించాలని ఆర్టీసీ కార్మికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే, హరీష్‌, ఈటల... ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ఈ ఇద్దరు మంత్రులూ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.