బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మంత్రులను అడ్డుకున్న సెక్యూరిటీ!!

 

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం నాడు ఉదయం నుండి టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా.. వరద పరిస్థితిపై అంచనా కోసం తామే విజువల్స్ తీయాల్సిందిగా ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది. దీనిపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అయితే చంద్రబాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వరద పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎమ్మెల్యే మల్లాది విష్ణులను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించ లేదు. మరోవైపు మంత్రుల రాకను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చంద్రబాబు నివాసం వద్ద వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము వచ్చినట్టుగా మంత్రులు చెప్పారు. అయితే మంత్రులను భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. బాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మంత్రులపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసంలోకి మంత్రులు వెళ్లేందుకు ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. మంత్రులు వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో చంద్రబాబు నివాసంలోకి వెళ్లకుండా మంత్రులు వెనుదిరిగి వెళ్లిపోయారు.