జెడిలక్ష్మీనారాయణ బదిలీకై మంత్రుల ఒత్తిళ్లు
Published on: Thu Aug 23, 2012 3:07PM
జగన్ అక్రమార్జన కేసులో దర్వాప్తు చేస్తున్న సిబిఐ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణను బదిలీ చేయించాలని కొందరు మంత్రులు అధిష్టానం పై వత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది.ఇంకా ఆయనను బదిలీ చేయకపోతే తమ రాజకీయ జీవితాలు ముగిసి పోవడమే కాక, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవ్వటం తప్పదని వారు అధిష్టానానికి తెలిపారని సమాచారం. కేంద్రం ఈ విషయమై సత్వరమే స్పందించాలని అలాకాని పక్షంలో తమ దారి తాము చూసుకోక తప్పదని హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు.హైకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు ప్రారంభించినా కేవలం వైయస్ జగన్ ఆస్తుల లక్ష్యంగా దర్యాప్తు జరుగుతుందని ఆదిలో భావించారు. అధిష్టానం కూడా అదే విధంగా భ్రమ కల్పించారు. కాని సిబిఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ మంత్రులందరినీ బాధ్యులను చేయటంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలయ్యింది. ఐఏఎస్ అధికారులను,మంత్రిని జైలు పాలు చేయటంతో నాయకుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.నాటి రెవెన్యూ, నేటి రోడ్లుభవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌ను ఎ5గా చేర్చి చార్జిషీటు దాఖలు చేయడంతో పరిస్థితులు చేయిదాటి పోతున్నవనే ఆందోళన నాయకుల్లో ఎక్కువయ్యింది. ఈ నేపధ్యంలో డిల్లీ పెద్దలపై వత్తిడి తెచ్చి ఆయన్ను బదిలీ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆయన రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆయనపై ఇతర ప్రభావాలు కూడా పడుతున్నాయని వారి ఆరోపణ. ఏదిఏమైనా జగన్ వ్యవహారంతో పోతుంది మనకేం పర్వాలేదనుకున్న మంత్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్లయింది.


