తిరుమలలో అన్యమత ప్రచారం.. టీడీపీ రాజకీయ డ్రామా!!

 

తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేయడంపై తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తిరుపతిలో నిరసన కూడా వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శల దాడి చేశారు. సదరు టికెట్లు గత ప్రభుత్వ హయాంలోనే ముద్రించారని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లాయని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇదంతా టీడీపీ రాజకీయ డ్రామాగా పేర్కొన్నారు. హిందుత్వం మీద బాబు చేయని అరాచకాలు లేవన్నారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం నుంచి బంగారాన్ని లారీల్లో తరలించడం వంటి దుర్మార్గాలు చేశారని ఆరోపించారు. అందుకే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. మతాలన్నీ ఛీకొట్టబట్టే చంద్రబాబు అందరికీ దూరమయ్యారని మంత్రి అన్నారు.

ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, సీఎంకి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, దానికి సంబంధించిన వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని మంత్రి విమర్శించారు. కొన్ని టీవీ ఛానళ్లు, కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారాన్ని మరింతగా ప్రచారం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనసులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా.. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.