తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చినట్లేనా

తెలంగాణలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఐతే ప్రతి రోజు వందల నుండి ఏకంగా వేలలో కేసులు నమోదవుతున్నాయి. పటిష్టమైన భద్రత, కట్టుదిట్టమైన ప్రివెంటివ్ వాతావరణం లో ఉండే సాక్షాత్తు ప్రగతి భవన్ ను సైతం చుట్టుముట్టేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ప్రగతి భవన్ లో 30 మంది కి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారని కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. మరో పక్క లాక్ డౌన్ పక్కా అనే వార్తలు రావడం తో ఏపీకి చెందిన నగరవాసులు ఏపీ బాట పట్టడంతో హైవే టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఐతే తెలంగాణ కేబినెట్ సమావేశంలో దీని పై చర్చించి మళ్ళీ లాక్ డౌన్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు దీని పై ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అసలు కేబినెట్ సమావేశం ఎపుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ప్రజలు మాత్రం లాక్ డౌన్ డెసిషన్ తో సంబంధం లేకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఐతే తాజాగా ఈ విషయం పై హైదరాద్ కు చెందిన సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా కు లాక్ డౌన్ అనేది సమాధానం కాదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి పాటిస్తే కరోనా ను అదుపులో పెట్టవచ్చని అన్నారు. మరో పక్క ప్రయివేట్ హాస్పిటల్స్ కు కరోనా ట్రీట్ మెంట్ కు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శించారని ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ దోపిడీ షురూ అయిందన్నారు. ఐతే ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ వద్ద 10 గంటలు వేచి ఉన్నా కనీసం పేషంట్లను చేర్చుకునే పరిస్థితిలో కూడా అవి లేవని ఆయన అన్నారు. దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని బట్టి లాక్ డౌన్ ఆలోచన తెలంగాణ సర్కార్ చేయడం లేదని అర్ధమవుతోంది.

లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం కోణం మాత్రం వేరుగా ఉందంటున్నారు పరిశీలకులు. గత ఏప్రిల్, మే నెలల్లో విధించిన లాక్ డౌన్ తో ప్రభుత్వం ఆదాయం అడుగంటిందని దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలలో కూడా కోత విధించవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బహుశా లాక్ డౌన్ ఆలోచన చేయకపోవచ్చని, ఐతే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్ట్రిక్టుగా నిబంధనలు అమలు చేస్తారని మరో వాదన.