కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు?.. సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు

తెలంగాణ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కరోనా విలయతాండవం, పాత సచివాలయం కూల్చివేత వంటి అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులకు పూర్తీ జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఇంత కంగారుగా పాత సచివాలయం కూల్చివేసి రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 2012-13లో పూర్తయిన భవనాలను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని, విభజన చట్టం ప్రకారం గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విపక్షాల వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు? ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా? అంటూ ప్రశ్నించారు. సచివాలయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. ముందు నీ కుర్చీ కాపాడుకో, తెలంగాణ ఉద్యమంలో నువ్వెకడున్నావ్ అంటూ ప్రశ్నించారు.  బిల్డింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని గుర్తుచేసారు. ఆంధ్రా వాళ్లు మాట్లాడినట్టు మీరు కూడా సెక్షన్-8 అంటున్నారు. మరోసారి సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు. హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించం అంటూ వ్యాఖ్యానించారు. పాత సచివాలయంలోకి కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి ఉంది. సచివాలయం రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.