TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టన్నెల్‌లో రాత్రంతా పనులు పరిశీలించిన మంత్రి రామానాయుడు

Published on: Wed May 6, 2026 12:21PM

 

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం యంత్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టన్నెల్‌లో జరుగుతున్న బెంచింగ్, లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో మంత్రి క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టారు. 

పనులు జరుగుతున్న నాలుగు గ్యాంట్రీల వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.రాత్రంతా టన్నెల్‌లోనే ఉండి పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించిన మంత్రి, 24 గంటలపాటు క్లాక్‌వైజ్ విధానంలో పనులు కొనసాగాలని సూచించారు. 

 

 

టన్నెల్‌లో పనిచేస్తున్న గ్యాంట్రీలు, కార్మికులు, యంత్రాల మధ్య సమన్వయం పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.సుమారు 19 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్స్‌లో క్లిష్టమైన, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులు, అధికారులకు మంత్రి స్వయంగా రాత్రివేళల్లో అక్కడే ఉండి ప్రోత్సాహం కల్పించడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.