నేనెవరో తెలుసా మంత్రిగారి భార్యని.. అయితే ఏంటి?

 

నేనెవరో తెలుసా ఎమ్మెల్యే బామ్మర్దిని, నేనెవరో తెలుసా ఎంపీ కొడుకుని.. అంటూ రాజకీయ నేతల కుటుంబసభ్యులు అప్పుడప్పుడు హంగామా చేయడం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. టోల్ గేట్ వద్ద టోల్ ఫీజ్ విషయంలో ఓ మంత్రిగారి భార్య నానా హంగామా చేశారు. ఫీజు విషయంలో టోల్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఆవిడ ఎవరో కాదు.. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి.

వెంకటకుమారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద ప్రజాప్రతినిధులకు ఉచితం ఉంటుంది. కానీ ఆ స్టిక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఉండదు. స్టిక్కర్ ఉన్నా కొన్ని సార్లు మాత్రం ఫీజు కట్టాల్సిందే. కానీ మంత్రి గారి భార్య ఈ లాజిక్ మిస్ అయ్యారు. టోల్ గేటు ఫీజు కట్టేదిలేదని భీష్మించుకున్నారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిబంధనలు వివరించినా ఆమె పట్టించుకోలేదు.. నేను మంత్రి గారి భార్యను నన్నే టోల్ గేటు ఫీజు అడుగుతారా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు.

అయితే ఆ టోల్ గేట్ సిబ్బంది కూడా ఊరుకోలేదు. ఫీజు కట్టాల్సిందేనని పట్టుపట్టారు. లేదంటే కారు కదిలేది లేదన్నారు. ఫీజు విషయంలో ఉచితం మంత్రిగారికే తప్ప.. స్టిక్కర్ ఉన్న కారు వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉండదని తెగేసి చెప్పారు. అదీగాక స్టిక్కర్‌ గడువు కూడా ముగిసింది రూల్స్‌ ప్రకారం టోల్‌ ఫీజు చెల్లించాల్సిందేనని అన్నారు. దీంతో ఎంతసేపు గొడవపెట్టుకున్నా టోల్ సిబ్బంది వినకపోయేసరికి వారిపై చిర్రుబుర్రులాడుతూ ఫీజు కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు వెంకట కుమారి.