TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

Published on: Sun Jul 6, 2025 4:33PM

 

తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతొ కలిసి  అందజేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలి ఏకాది శుభ దినాన ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందని  మంత్రి పొంగులేటి అన్నారు.

 ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దు.రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు  ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుద్రంపూరం చెందిన శివ అనే యువకుడు తనకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్ ఎక్కాడు. ఆనాడు మేము అధికారంలో లేము. అయినా మేము అధికారంలోకి రాగానే ఇండ్ల పట్టా ఇస్తామని ఆరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఇప్పుడు ఇండ్ల పట్టా ఇచ్చామని మంత్రి తెలిపారు. 

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు వారి  సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పాలకులే. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు.  ఇప్పుడు అనేక అంశాలపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి వాళ్లు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.