ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కంగారుపడొద్దు.. ఎవరినీ తొలగించలేదు

ఏపీఎస్ ఆర్టీసీ ఒకేసారి 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించిందన్న వార్త సంచలనమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల జీతం రాక, లాక్డౌన్ వేళ అవస్థలు పడుతున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడం ఏంటని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయితే, తాజాగా ఈ అంశంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆర్టీసీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని స్పష్టం చేశారు. 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన, ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు రావాలని సర్క్యులర్ జారీ చేశామని మంత్రి చెప్పారు.  దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారని మండిపడ్డారు. కరోనా సంక్షోభం వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కంగారుపడొద్దని సూచించారు. ఎవరినీ తొలగించబోమని, యథావిధిగా కొనసాగుతారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పనే గాని, తొలిగింపు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు.