TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీడియాకు నో ఎంట్రీ.. ఏం చేస్తారో చేసుకోండి! మంత్రి పెద్దిరెడ్డి ఓవరాక్షన్..

Published on: Mon Dec 13, 2021 9:25AM

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవరాక్షన్ పెరిగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా పాలనా యంత్రాంగాన్ని శాసిస్తున్న పెద్దిరెడ్డి.. తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అధికారులందరికి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, ఎవరైనా వినకపోతే బదిలీ చేయించడం కామన్ గా మారిపోయిందని అంటున్నారు. అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి.. మీడియాను శాసించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. 

చిత్తూరు జిల్లా  జడ్పీ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించలేదు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. జడ్రీ సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాబట్టి మీడియా బయటకు వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు  వివరిస్తామని తెలిపారు.  కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను జడ్పీ సమావేశం హాల్ నుంచి బయటికి పంపించారు సీఈవో ప్రభాకర్ రెడ్డి. ఎజెండాలోని అంశాలను చర్చించాల్సి ఉందని, కాబట్టి దయచేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు బయటకు వెళ్లిపోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి కూడా కోరారు. తమను కవరేజీకి అనుమతించాలని విలేకరులు అభ్యర్థించినప్పటికీ నిరాకరించారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి కలగజేసుకుని.. సమావేశ వివరాలను సమాచార శాఖ వెల్లడిస్తుందని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో మీడియా ప్రతినిధులు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. అయితే మధ్యాహ్నం దాటినా విలేకరులకు ఆ వివరాలు అందవ్వలేదు. సమావేశం  తర్వాత మీడియాకు వివరాలు చెబుతామన్న మంత్రి పెద్దిరెడ్డి ... ఏ వివరాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. మంత్రి తీరుపై మీడియా ప్రతినిధులు భగ్గుమంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. అధికారుల లాగానే మీడియాను తన చేతుల్లో ఉంచుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు.