ఎస్ఈసీ ఆదేశాలకు తలవంచిన మంత్రి పెద్దిరెడ్డి
Published on: Sat Feb 6, 2021 4:56PM
ఎస్ఈ సి నిమ్మగడ్డ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పై నిప్పులు చెరిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్టకేలకు దిగివచ్చారు. కొద్దీ సేపటి క్రితం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, ఆయనకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడనని ప్రకటించారు. అంతేకాకుండా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడనని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని అయన చెప్పారు. అయితే నిన్నటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అయన స్పష్టం చేశారు. మరోపక్క చట్టబద్ధంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు. అయితే ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమీక్ష ఏంటి? అని మళ్ళీ ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు అయినా చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
ఈరోజు ఉదయం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత వారికి గుణపాఠం నేర్పుతాం" అని హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా "మార్చి 31 తర్వాత నిమ్మగడ్డకు చంద్రబాబు ఫోన్ కూడా చేయడు. మేము బాబులాగా కాదు. మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు న్యాయం చేస్తాం. నేనేమీ మాట్లాడకపోయినా నాతోపాటు బొత్సపైనా గవర్నర్‌కు లేనిపోనివి ఫిర్యాదు చేశారు. దాంతో శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాం. కమిటీ ముందుకు వచ్చి నిమ్మగడ్డ సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.


