మోడీకి చంద్రబాబు భయంపట్టుకుంది

 

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రర్యటనపై మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోడీ మళ్లీ ఎలా అడుగుపెట్టారు? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చాపట్లలో మోడీ పర్యటన నేపథ్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సునీత.. "రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహాన్ని తెలుగు ప్రజలు మరచిపోరు. అమరావతిని ఢిల్లీకి మించి నిర్మిస్తానన్నారు.. నిధుల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరుకు వచ్చినప్పుడు చెప్పిన ప్రధాని ఇప్పుడు అదే గుంటూరులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మోడీ గుంటూరుకు మా నాయకుడు చంద్రబాబును తిట్టడానికే వచ్చినట్లుంది" అని సునీత వ్యాఖ్యానించారు. స్థాయిని మరచి దిగజారి చంద్రబాబు గురించి మోడీ మాట్లాడారు. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు నరేంద్ర మోడీకి లేదు అని ధ్వజమెత్తారు. 
ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ కాబట్టే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతున్నారు. చంద్రబాబు సీనియర్ కాబట్టే కేంద్ర ప్రభుత్వం జై కొట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి 670 అవార్డులు ఇచ్చారు అని సునీత అన్నారు. చంద్రబాబు పరిపాలన దక్షత చూసే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రమికవేత్తలు ముందుకొస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చిన అతి పెద్ద పరిశ్రమ ‘కియా’ నే దీనికి నిదర్శనం. మోడీ చెప్పే అబాద్దాలు నమ్మడానికి తెలుగు ప్రజలు సిద్దంగా లేరు. మోసకారి మోడీని గద్దె దింపేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. మోడీకి కలలో కూడా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తున్నారన్నారు. చంద్రబాబు బీజేపీ యేతర కూటమి ఏర్పాటు ప్రయత్నంతో మోడీ పీఠం కదులుతుందని భయపడుతున్నారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడ మాట్లాడలేదంటేనే జగన్‌తో మీరు కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. ముగ్గురు మోడీలు కలిసి చంద్రబాబుని తొక్కాలని చూస్తున్నారు. ఎంతమంది మోడీలు కలిసినా చంద్రబాబుని ఏమీ చేయలేరు అని వ్యాఖ్యానించారు.