జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ అమ్మకం.. పార్లమెంట్ లో కేంద్రం క్లారిటీ

అయిపాయే. అంతా అయిపాయే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేతులెత్తేసింది. పార్లమెంట్ లో మళ్లీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని కోరామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణపై సుస్పష్ట ప్రకటన చేశారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి పార్టీల నుంచి ఎన్ని ఒత్తిడులు వస్తున్నా కేంద్రం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్ లో ప్రకటన చేయడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత ఎగిసిపడుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పై ఇప్పటికే రాష్ట్రంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించడంతో ఇన్నాళ్లూ తమకేమీ తెలీదన్నట్టు చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడినట్టైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం సీఎం జగన్ కు తెలిసే జరిగిందని తేటతెల్లమైంది.