TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త రేషన్ కార్డుకు ఆ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి నాదెండ్ల

Published on: Thu May 22, 2025 3:31PM

 

రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. అలాగే పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో కూడా అవసరం లేదన్నారు. ఈ విషయంలో క్షేత్రస్ధాయి సిబ్బంది పొరపాట్లు చేయువద్దని ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి కార్డులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన 4.24 కోట్ల మందికి జూన్ నెలలో ఉచితంగా రేషన్ కార్డులు (స్మార్ట్ రైస్‌కార్డులు) జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద సిద్ధంగా ఉందని, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం సామాన్యులకు మరింత చేరువగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రైస్‌కార్డులను అందిస్తామని, దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.

ఫ్యామిలీ సభ్యుల్లో ఎవరినైనా వయసుతో నిమిత్తం లేకుండా రేషన్ కార్డులో చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. అయితే, కార్డు నుంచి పేర్ల తొలగింపునకు మాత్రం ప్రస్తుతం మరణించిన వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా, రేషన్ కార్డులో కుటుంబ పెద్ద (హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ) పేరు మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కార్డులో నమోదైన తప్పుడు వివరాలను సరిచేసుకునేందుకు గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇకపై తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించుకునేలా సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.