భూముల అమ్మకం పాలనలో భాగమే

ప్రభుత్వ స్థలాలు అమ్మడం ఇవాళ కొత్తేమీ కాదని.. భూముల అమ్మకాలు పరిపాలనలో భాగమేనని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో భూములు విక్రయించలేదా? అని విపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ భూములను విక్రయించి ప్రజల కోసం ఖర్చు పెట్టడం తప్పా? అని నిలదీశారు. భూములు అమ్మడం సీఎం జగన్‌ హయాంలో మొదలైనట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని మోపిదేవి మండిపడ్డారు. రైతు భరోసా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 49.56 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. వైకాపా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సకాలంలో పంట వేసుకోవడం నుంచి అమ్ముకునే వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మోపిదేవి భరోసా ఇచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రైతు భరోసా కింద 4.52 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం కింద విడుదల చేసిన రూ.250 కోట్లను ఇవాళ సాయంత్రం లోగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయని మంత్రి అన్నారు. అయితే ప్రభుత్వ పథకాల అమలులో మాత్రం ఆలస్యం జరగడంలేదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్య బృందాలు అభినందించాయని ఆనందం వ్యక్తం చేశారు.