మంత్రి మేకపాటి లేఖ కలకలం.. నా పరిస్ధితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటి?

నెల్లూరులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట అధికారులు వినడం లేదా? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. తాజాగా జిల్లా కలెక్టర్‌ కి ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. 

 

తన క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యం దారుణంగా ఉందని సిబ్బంది పలుమార్లు స్ధానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నేరుగా మంత్రే రంగంలోకి దిగారు. మంత్రి గౌతంరెడ్డి జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబుకు అధికారుల తీరుపై లేఖ రాశారు. స్ధానిక హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ తన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం లేదని ఫిర్యాదు చేశారు. గతంలో తనను వ్యక్తిగతంగా కలవాలని కోరినా కూడా అధికారి పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తన పరిస్ధితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని మంత్రి గౌతంరెడ్డి ప్రశ్నించారు.

 

ఇటీవల మున్సిపల్ అధికారులతో మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివ్యూ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ ప్రకటించారు. అనిల్ అలా ప్రకటన చేసి వారం తిరగక ముందే మంత్రి మేకపాటి అధికారుల తీరుపై కలెక్టర్‌ కి లేఖ రాయడం విశేషం.

 

మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యాన్నే అధికారులు నిర్లక్ష్యం చేయడం, సిబ్బంది నుంచి పలుమార్లు అధికారులకు ఫోన్లు వెళ్ళినా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్ధానికంగా నెలకొన్న రాజకీయాల కారణంగానే మంత్రి ఆదేశాలు కూడా లెక్కచేయకుండా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గౌతంరెడ్డికి సీఎం జగన్ మంత్రి బాధ్యతలు కట్టబెట్టడం జీర్ణించుకోలేని కొందరు సొంత పార్టీ నేతలే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గౌతంరెడ్డి మాట వినకుండా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో, మంత్రి మేకపాటి ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.