బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ.!
Published on: Thu Jul 16, 2026 2:18PM
.webp)
తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. గోల్కొండ కోట గోడల మధ్య భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఉత్సవాలకు గోల్కొండ కోట తొలి వేదిక కావడం ప్రత్యేకత. లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి ఘనంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ సాంప్రదాయబద్ధంగా మంత్రి కొండా సురేఖకు బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు ఆకాంక్షించారు.
ఈ వేడుకల సందర్భంగా గోల్కొండ ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 11 లక్షల రూపాయల చెక్కును మంత్రులు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ నిధులతో భక్తులకు కల్పించే సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గోల్కొండ, లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్త జనంతో కిక్కిరిసిపోయాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఈ వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల దుస్తులు ధరించిన పోతురాజులు డప్పుల దరువులకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ బోనాల జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Golconda Bonalu 2026, Ashada Bonalu, Golconda Jagadambika Temple, Telangana Festivals, Hyderabad Bonalu Jatara


