ప్రధానిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్టేనా?

తిరుమల డిక్లరేషన్ పై మంత్ర కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వేడి చల్లారక ముందే కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం తిరుమల చేరుకున్న ఆయన.. ప్రధాని మోదీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తిరుమలకు జగన్ సతీసమేతంగా రావాలని, సంప్రదాయాన్ని పాటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. ప్రధాని మోదీని కూడా సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? మోదీ తన భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి అంటూ కొడాలి నాని విరుచుకుపడ్డారు.

 

ఇక తనను బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‍పై కూడా స్పందించిన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన బీజేపీకి.. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‍కు సలహాలు ఇచ్చే స్థాయి ఉందా? అని ధ్వజమెత్తారు.

 

బ్రహ్మోత్సవాల సమయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంకన్నను వాడుకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అన్నారు.

 

శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన.. స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని.. ఈ నిబంధనను రాజులు పెట్టారా? బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చారా? అనే విషయంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 

 

తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే జగన్ సీఎం అయ్యారని నాని చెప్పారు. సీఎం హోదాలోనే ఆయన తిరుమలకు వస్తున్నారని, స్వామికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని అన్నారు. సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయంలో హిందువులా, చర్చిలో క్రైస్తవుడిలా, మసీదులో నవాబులా ఉంటారని చెప్పుకొచ్చారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎంను టీటీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని కొడాలి నాని ప్రశ్నించారు. 

 

కాగా, ప్రధాని మోదీ పైనా, బీజేపీ పైనా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడానికి వేరే కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీ టూర్ లో సీఎం జగన్ కి అమిత్ షా క్లాస్ పీకారని వార్తలొచ్చాయి. ఏపీలో న్యాయ వ్యవస్థ పైనా, హిందూ ఆలయలపైనా జరుగుతున్న దాడుల నేపథ్యంలో జగన్ ని అమిత్ షా తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. దీంతో ఉక్రోషంలో జగన్.. కొడాలి నానిని తిరుమలకు పిలిపించి మరీ మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో హిందూ పెద్దల ఆగ్రహానికి గురైన కొడాలి నాని.. ఇప్పుడు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటారో చూడాలి.