ఏపీ మంత్రి కిడారి శ్రావణ్ రాజీనామా
Published on: Thu May 9, 2019 5:32PM

ఏపీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎంవో అధికారులను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. సీఎంవో ద్వారా గవర్నర్ నరసింహన్‌కు ఈ రాజీనామా లేఖ వెళ్లనుంది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కు సీఎం చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిడారి శ్రావణ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవాళ్లు.. ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగ ప్రకారం ఆయన 11వ తేదీ నుంచి మంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో తానే ముందుగా రాజీనామా చేస్తే బాగుంటుందని శ్రావణ్ కుమార్ రాజీనామా చేశారు. కాగా, తన రాజీనామాకు ముందు సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో.. మంత్రి నారా లోకేష్‌ని కలిసి రాజీనామా వ్యవహారంపై చర్చించారు కిడారి శ్రావణ్ కుమార్.
.jpg)


