TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాల్సిందే..

Published on: Wed Jul 25, 2018 10:26AM

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఫ్లైఓవర్‌ పనులకు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

 

ప్రత్యేక హోదాతో ఏపీకి పన్ను రాయితీలు ఉంటాయని, దీంతో హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ తరలిపోతే రాష్ట్రంలోని యువత పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఏపీకి పన్ను రాయితీలు ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్‌ చెప్పాలన్నారు.ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టును ఈ రోజు వరకూ విభజించకుండా కాంగ్రెస్‌, భాజపా అన్యాయం చేశాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.తెలంగాణకు అన్యాయం జరగడాన్ని కాంగ్రెస్‌ నేతలు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.ఏపీకి మాత్రమే హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తారా? అని నిలదీశారు.