మంత్రి గీతారెడ్డి తొలగింపుకు తెదేపా ఒత్తిడి

 

రాష్ట్ర విభజన అంశంతో ఇప్పటికే తల బొప్పి కట్టి ఉన్నకాంగ్రెస్ పార్టీకి, నిన్నసీబీఐ చార్జ్ షీట్లో మంత్రి గీతారెడ్డి పేరు చేర్చడం, మరో వైపు డీజీపీ దినేష్ రెడ్డిపై సీబీఐ విచారణ మొదలవడంతో ప్రతిపక్షాలకు మరోమారు అడ్డుగా దొరికిపోయింది. ఈ రోజు తెదేపా నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ-9వ నిందితురాలిగా పేర్కొనబడిన మంత్రి గీతారెడ్డిని వెంటనే పదవిలోంచి తొలగించవలసిందిగా వినతిపత్రం సమర్పించారు. ఇక సీపీఐ నేత నారాయణ మరో అడుగు ముందుకు వేసి, డీజీపీ దినేష్ రెడ్డిని కూడా తొలగించాలని డిమాండ్ చేసారు.

 

ఇంతకు ముందు ధర్మాన, సబితలపేర్లు సీబీఐ చార్జ్ షీట్లోకి ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని ఎంత వెనకేసుకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో వారిరువు చాలా అవమానకర పరిస్థితుల్లో తమ పదవులకు రాజీనామాలు చేయవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గీతారెడ్డి వంతు వచ్చింది. సబితా రెడ్డి హోంమంత్రి పదవి నుండి దిగిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డికి తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. అందువల్ల ఇప్పుడు ఆమె కూడా ఇదివరకు సబితారెడ్డి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తోంది. గనుక ఆమె హోంశాఖను తిరిగి ముఖ్యమంత్రికి అప్పగించవచ్చును, లేదా మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం దరఖాస్తు చేసుకొన్నఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సమస్య రావడం యాదృచ్చికమే అయినప్పటికీ, ఇప్పుడు గీతారెడ్డిని ఉపేక్షిస్తే తేదేపాకు మరో కొత్త అస్త్రం అందించినట్లవుతుంది. గనుక కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పదవి నుండి తప్పుకోమనే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. బహుశః కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు హోంశాఖ అంతగా అచ్చిరావట్లేదేమోననిపిస్తోంది.