ఇది అసలైన ట్విస్ట్.. టీడీపీని వీడనున్న గంటా!!

 

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ ఎంత టెన్షన్ పడతాడో.. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం అంత టెన్షన్ పడుతుంది అనిపిస్తోంది. టీడీపీని వీడనున్న మరోనేత అంటూ గంటకో పేరు బయటికి వస్తుంది. దీంతో ఈ జంపింగులు ఇంతటితో ఆగుతాయా? లేక ఇంకా నేతలు క్యూ కడతారా అంటూ టీడీపీ అధికాయకత్వం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పాపం వాళ్ళు అలా ఎదురుచూస్తున్నారో లేదో ఈసారి మరో షాకింగ్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన ఎవరో కాదు మంత్రి గంటా శ్రీనివాసరావు.

నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడడానికి సిద్ధమయ్యారని తెలిసి.. ఆయన మిత్రుడు గంటా బుజ్జగింపులు జరపడానికి రంగంలోకి దిగారంటూ వార్తలొచ్చాయి. అయితే అవంతి వైసీపీలో చేరడం జరిగిపోయింది. అంతేకాదు మంత్రి గంటా కూడా టీడీపీని వీడడానికి సిద్దమయ్యారంటూ సంచలన వార్త తెరమీదకు వచ్చింది. ఈ విషయాన్ని అవంతి శ్రీనివాస్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. గంటా టీడీపీలో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని.. ఏ పార్టీలో చేరుతారనే విషయం తనకూ తెలియదని, కానీ తాను మాత్రం వైసీపీలో చేరాలని సూచిస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. మరి గంటా తన మిత్రుడు అవంతి శ్రీనివాస్ తరహాలోనే వైసీపీలో చేరుతారా? లేక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ఎంచుకుంటారా? లేదా అసలు ఈ వార్తలని ఖండించి టీడీపీలోనే కొనసాగుతారా చూడాలి.