మంత్రి ఈటెలకు ముప్పు తప్పింది
Published on: Mon May 18, 2015 1:20PM

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఈటెల రాజేందర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిని దైవకృపగానే భావించాల్సి వుంటుంది. ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో ఉన్న ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు మెట్‌పల్లి సమీపంలో ఒక చెట్టును చాలా వేగంగా ఢీకొంది. మంత్రి కాన్వాయ్ హుజూరాబాద్ నుంచి వెంకట్రావ్‌పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చాలా వేగంగా ఈ వాహనం చెట్టును డీకొనడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో మంత్రి ఆ కారులో లేరు. దాంతో పెద్ద ముప్పు తప్పింది. సాధారణంగా మంత్రి ఈటెల ఎప్పుడూ ఈ కారులోనే ప్రయాణిస్తూ వుంటారు. సోమవారం నాడు ఎందుకనో ఆయన ఈ కారు ఎక్కలేదు. మంత్రికి ప్రమాదం ముప్పు తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


