కరోనా హాస్పిటల్‌లో ఫ్లోర్ తుడిచిన మంత్రి..
Published on: Sat May 15, 2021 7:06PM
కరోనా వచ్చినప్పటి నుంచీ ఒక్క ప్రజాప్రతినిధి అయినా బయట కనిపిస్తే ఒట్టు. ఎవరింట్లో వాళ్లు గప్‌చుప్. హాస్పిటల్స్‌లో బెడ్స్ లేకపోయినా, ఆక్సిజన్ అందకపోయినా, మందులు దొరక్కపోయినా.. ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అయితే, ఆ రాష్ట్ర మంత్రి.. మన మంత్రుల్లా మాత్రం కానే కాదు.
మిజోరం విద్యుత్ శాఖ మంత్రి లాల్జిర్లియానా కరోనా బారిన పడి ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతనున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేశాడు. అటు నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. ఇక లాభం లేదని తన గది తానే శుభ్రం చేసుకున్నాడు. స్వయానా మంత్రి అయి ఉండి.. అందులోనూ కొవిడ్‌తో బాధపడుతూ కూడా.. ఆసుపత్రిలో ఫ్లోర్ క్లీన్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
‘ఆసుపత్రిలో నేలను తుడిచి నేను వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేనొక ఉదాహరణగా నిలిచి, ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన’ అని ఆ మంత్రి అన్నారు.
‘నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఈ పనులు చేశాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు’ అని ఆయన చెప్పారు.
అధికార దర్పం పక్కనపెట్టి ఆసుపత్రిలో నేలను తుడిచి ఆశ్చర్యపర్చారు సదరు మంత్రివర్యులు. ఇది చూసైనా మన మంత్రుల్లో కాస్తైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. మంత్రులేమీ అలా ఫ్లోర్ తుడవాల్సిన పనిలేదు. కనీసం ఒకసారైనా హాస్పిటల్స్‌కు విచ్చేసి కొవిడ్ సేవలు, వసతులు పరిశీలించినా చాలు. అలా చేస్తే.. వైద్య సిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది. రోగులకు ధైర్యం వస్తుంది.


