కరెంట్ బిల్లులపై తప్పుడు ప్రచారం.. అసలు మేటర్ ఏంటంటే?

ఏపీలో కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో వందల్లో వచ్చే బిల్లులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండంపై, జగన్ సర్కార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కరోనా కష్టకాలంలో కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుతంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా ఈ వ్యవహారాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పుకొచ్చారు. అదీగాక, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ, టీవీల వాడకం వల్ల పెరుగుతుంది అన్నారు. ‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది.' అని మంత్రి చెప్పుకొచ్చారు.