TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రిని బూతులు తిట్టిన సీఐ!.. అలిగి వెళ్లిపోయిన అప్ప‌ల‌రాజు..

Published on: Wed Feb 9, 2022 1:58PM

ఏపీ పోలీసులు వైసీపీ నేత‌లు చెప్పిన‌ట్టు చేస్తున్నార‌నే విమ‌ర్శ ఉంది. అధికార పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లో ఖాకీలు మెదులుతున్నార‌ని అంటారు. ప్ర‌తిప‌క్ష‌మే టార్గెట్‌గా పోలీసులు రెచ్చిపోతున్నార‌నే ఆరోప‌ణ వినిపిస్తోంది. అయితే, అంద‌రు పోలీసులు ఒకేలా ఉండ‌రు. ఖాకీల‌లోనూ నిఖార్సైన వాళ్లు ఉంటార‌ని నిరూపించారు. కాక‌పోతే, కాస్త ఓవ‌ర్ చేయ‌డంతో ఆ విశాఖ సీఐ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లంగా రేపుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

సీఎం జ‌గ‌న్ విశాఖ శార‌దా పీఠం విచ్చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు.. మంత్రి సీదిరి అప్పలరాజు సైతం విశాఖ శారదాపీఠం ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అనుచ‌రుల‌తో క‌లిసి ఆశ్ర‌మంలోకి వెళుతుండ‌గా.. అక్క‌డే విధుల్లో ఉన్న అరిలోవ సీఐ రామూనాయుడు వారిని అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లండని.. మిగ‌తా అనుచ‌రులంతా బ‌య‌టే ఉండాల‌ని హుకుం జారీ చేశారు. అయితే, అనుచ‌రులు లేకుండా వెళ్లేది లేద‌ని మంత్రి చెప్ప‌డంతో.. అలాగైతే మీరూ బయటకు పొండి అంటూ ఆ సీఐ.. ఓ అస‌భ్య పదజాలంతో త‌న‌ను తిట్టారని మంత్రి అప్ప‌ల‌రాజు అంటున్నారు. దీనిపై మంత్రి అనుచరులు.. సీఐకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలిపారు. 

అక్కడ ఉన్న పోలీస్‌ ఉన్నతాధికారులు మంత్రిని సముదాయించేందుకు ప్ర‌యత్నించినా ఆయన విన‌లేదు. బూతులు మాట్లాడిన సీఐని పిలిపించి క్షమాపణ చెప్పించాలని కొద్దిసేపు గేటు ద‌గ్గ‌రే ఉన్నారు. అయినా, ఆ సీఐ సారీ చెప్పేందుకు స‌సేమిరా అన‌డంతో.. అవ‌మానంగా ఫీల్ అయిన మంత్రి అప్ప‌ల‌రాజు ఇక తాను అక్కడ ఉండబోనంటూ అస‌హ‌నంతో వెళ్లిపోయారు. ఈ విషయం హోంమంత్రి సుచరిత ద‌గ్గ‌రే తేల్చుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్లారు అప్ప‌ల‌రాజు. ఖాకీల చేతిలో మంత్రికి జ‌రిగిన అవ‌మానం ఏపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోష‌ల్ మీడియాలో మంత్రికి అనుకూలంగా, వ్య‌తిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. మంత్రికి త‌ల‌వంచ‌ని సీఐ తీరును చాలా మంది మెచ్చుకుంటుంటే.. ఖాకీలు మంత్రిని అలా బూతులు మాట్లాడ‌ట‌మేంట‌ని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ వారిపై ఖాకీల‌ను ఉసిగొల్పితే త‌ప్పులేదు కానీ, అదే పోలీసులు అధికార పార్టీ నేత‌ను ఓ మాట అంటే నొప్పొచ్చిందా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.